తెలంగాణాలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా ఎస్సై, కానిస్టేబుల్ మొదటి దశ ప్రిలిమినరీ పరీక్ష ముగిసిన ఈవెంట్స్‌కు ఎంపికైన వారి జాబితా కూడా విడుదలైంది. అయితే ఈవెంట్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థుల కోసం ఈజీ టిప్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం.. చిన్న చిన్న మెళకువలను పాటిస్తూ.. పోలీస్ ఉద్యోగం సాధించాలనే మీ కలను సాకారం చేసుకోండి.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్లో(పీఈటీ)లో దశలివే..
* పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు ఎస్సై, ఫైర్ డిపార్ట్మెంట్,డిప్యూటీ జైలర్స్, కమ్యూనికేషన్ ఎస్సై అన్ని పోస్టులకు ఈవెంట్స్ ఒకే విధంగా ఉంటాయి. ఇందులో 3 రకాల ఈవెంట్స్ పూర్తి చేయాలి. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు ఈవెంట్స్ క్వాలిఫై మాత్రమే కానీ
ఏఆర్, ఏపీఎపీ, ఏపీఎఫ్, ఎన్‌ఏఆర్ సీపీఎల్ కేటగిరీ ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ పోస్టులకు అన్ని ఈవెంట్స్‌లో అర్హత తప్పనిసరి. తుది జాబితా రూపకల్పనలో వీటికి వెయిటేజీ ఉంటుంది. ఈవెంట్స్ మెరిట్ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. ఈ పోస్టులకు ఫిజికల్ టెస్ట్‌లోని మెరిట్, రాత పరీక్షలోని మార్కులు.. రెండింటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.
* పురుష అభ్యర్థులకు 1600 మీటర్ల పరుగు 7 నిమిషాల 15 సెకన్లలో, మహిళా అభ్యర్థులు 800 మీ పరుగు 5 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
* లాంగ్ జంప్ పురుషులకు 4మీ. మహిళా అభ్యర్థులకు 2.5 మీ. షాట్‌పుట్ పురుష అభ్యర్థులకు 6మీ (7.26 కేజీ బరువు), మహిళా అభ్యర్థులకు 4మీ (4కేజీ) బరువు ఉంటుంది.
1600 మీటర్ల పరుగు :
అభ్యర్థులు ఒకేసారి 1600 మీ. పరుగును ప్రారంభించకుండా తొలుత 200 మీ. పరుగు తర్వాత 400, తర్వాత 600 ఇలా పెంచుకుంటూ సాధన చేయాలి. ఇలా మొదటి రెండు వారాల వరకు సమయ నిబంధన లేకుండా సాధన చేయాలి. ఇలా రిక్రూట్మెంట్ బోర్డు కేటాయించిన సమయం ప్రకారం టార్గెట్ రీచ్ అయ్యేలా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల తుదిదశలో విజయం సాధించేందుకు వీలుంటుంది. మహిళలకు 800 మీ. పరుగు ఉంటుంది కావున వీరు కూడా దశల వారీగా ప్రాక్టీస్ ప్రారంభించాలి.
లాంగ్ జంప్‌కు ఇలా..
లాంగ్ జంప్‌కు ముందుగా పవర్ లెగ్‌ను సరిచూసుకోవాలి. జంప్‌కు టేకాఫ్ తీసుకోవడానికి అభ్యర్థులకు కుడికాలు లేదా ఎడమకాలు ఏది అనువుగా ఉందో పరీక్షించుకోవాలి. ఇందులో పురుషులు 4మీ. మహిళలు 2.5 మీ దుకాల్సి ఉంటుంది. ఇది దశల వారీగా దూరాన్ని, వేగాన్ని పెంచుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. సుమారు 20 మీ దూరం నుంచి పరిగెత్తుతూ వచ్చి టేకాఫ్ తీసుకోవాలి. లాంగ్ జంప్‌లో సైక్లింగ్ పద్ధతి మేలు. రోజూ అయిదు నుంచి పదిసార్లు సాధన చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.
షాట్‌పుట్‌లో
ఇందులో పురుషులు స7.26 కేజీలు, 6 మీ. దూరం వేయాల్సి ఉంటుంది. స్త్రీలు 4 కేజీల బరువు 4 మీ వేయాల్సి ఉంటుంది. షాట్‌పుట్ ప్రాక్టీస్‌కు ముందు రిస్ట్ ఎక్సర్‌సైజ్, వామప్స్ తప్పనిసరి. షాట్‌పుట్‌ను చేత్తో పట్టుకునే విధానం ముఖ్యం. చేత్తో షాట్‌పుట్‌ను తీసుకున్నప్పుడు చేతి వేళ్ల మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. షాట్‌పుట్‌ను కుడిచేత్తో విసిరే ముందు అభ్యర్థి ఎడమ చేయి తప్పనిసరిగా ముందుకు చూపించాలి. షాట్‌పుట్ వేయడంలో బాడీబెండ్ చేయడం, ఎడమ చేతిని ముందుకు చాపడం, కుడి చేతి ద్వారా విసరడం, ఎడమ కాలు ముందుకు, కుడి కాలు వెనక్కు ఉంచడం ముఖ్యమైనవి. ఇలా రోజూ పదిసార్లు చేయాలి.
అభ్యర్థులు తప్పక పాటించాల్సినవి..
* రోజూ ఉదయం 5 గంటల నుంచి 7.30, సాయంత్రం 5 గంటల నుంచి 7 వరకు ప్రాక్టీస్ కోసం కేటాయించాలి. మిగతా సమయంలో రాతపరీక్షకు ప్రిపరేషన్ కొనసాగించాలి.
* ఈవెంట్స్‌లో భాగంగా ముఖ్యంగా అభ్యర్థులు ముందుగా పరుగులో వేగం పెంచుకోవడానికి శ్వాసపై నియంత్రణా సామర్థ్యాన్ని పెంచుకోవాలి. రోజూ 30 నుంచి 40 నిమిషాల పాటు పరుగును క్రమేణా ప్రాక్టీస్ చేయాలి. పరుగును ప్రారంభించే ముందు వామప్స్ వల్ల శరీరం వేడెక్కి దేహ దారుఢ్య సాధన తేలికవుతుంది.
* వారంలో ఒకసారి తప్పనిసరిగా లాంగ్ రన్నింగ్ (5-6) కిలోమీటర్లకు తగ్గకుండా సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
* అభ్యర్థులు రన్నింగ్ కోసం బ్రాండెడ్ స్పోర్ట్స్ షూను ఉపయోగించాలి.
* తప్పనిసరిగా టీ షర్టు ధరించి, ప్రాక్టీస్ ప్రారంభించాలి.
* సిగరెట్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.
* రోజూ ఉడికించిన గుడ్లు, డ్రైఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు.. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
* సెలక్షన్స్‌లో ఒకేరోజు అన్ని ఈవెంట్స్ నిర్వహిస్తారు. కాబట్టి రోజు విడిచి రోజు తప్పనిసరిగా ఈవెంట్స్‌ను సరిచూసుకోవాలి.
* అభ్యర్థులు గ్రౌండ్‌కు ప్రాక్టీస్‌కు వెళ్లే ముందు తప్పనిసరిగా సపోర్టర్ ధరించాలి.
TS POLICE: పోలీసు ఈవెంట్స్‌లో విజయం సాధించండిలా..