ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్ చెప్పింది టీఎస్‌ఆర్టీసీ. త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీన ఉద్యోగాల భర్తీకి సంబంధించి గుడ్‌న్యూస్ వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది పనిచేస్తున్నారని, గత పదేళ్లుగా కొత్త నియామకాలు లేవని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కొత్త నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మహాలక్ష్మి పథకంతో పెరిగిన ఆక్సుపెన్సీ..
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా బస్సుల్లో ఆక్సుపెన్సీ రేటు గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లు బస్సు సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2,375 కొత్త బస్సు సర్వీసులను కూడా ప్రారంభించాలనే యోచనలో ఉంది. ఈ బస్సుల నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని నూతన రిక్రూట్‌మెంట్ ద్వారా నియమించనుంది.