telangana politics
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంత్రుల కామెంట్స్ ఓ వైపు మరో వైపు అధికార కాంగ్రెస్ ను ఎలాగైనా ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో అటు బీఆర్ఎస్, బిజెపి నేతల మాటల యుద్ధాలు మరో వైపు… ఇంతకీ తెలంగాణలో ఏం జరుగుతుంది….? పాలన గాడి తప్పిందని ప్రతి పక్షాలు, రేవంత్ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తుంది.ఇవేవి పట్టనట్టు మంత్రులు, తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని చెప్పక తప్పదు.
సౌత్ కొరియా పర్యటనలో ఉన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సీయోల్ నగరంలో ఉన్న హన్ రివర్ ప్రాజెక్టు సందర్శనకు కొంతమంది బృందంతో అక్కడికి వెళ్లారు. నాలుగు రోజులపాటు సాగిన ఈ పర్యటనలో ఆయనతోపాటు జర్నలిస్టులు, సహచర మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీల పాల్గొన్నారు. రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఈ బృందం అధ్యయనం చేసి తిరిగి బయలుదేరింది. అయితే అక్కడే ఓ టీవి ఛానల్ తో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మూసీ రివర్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే.. తెలంగాణ రాజకీయాలపై బాంబు పేల్చారు. సౌత్ కొరియా నుంచి హైదరాబాద్‌లో ఫ్లైట్ దిగేలోగా, బీఆర్ఎస్ నేతల అరెస్టులు ఉంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి. దీపావళి కంటే ముందే తెలంగాణలో బాంబుల మోత ఉంటుందంటూ వ్యాఖ్యానించారు.
అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని, దీపావళి బాంబుల మోతకు సిద్ధంగా ఉండాలంటూ ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. ఒకటి నుంచి తొమ్మిది వరకు నిందితుల లిస్ట్ సైతం రెడీ అయిందని, ఒక్కొక్కరుగా అరెస్టు అవుతారంటూ చెప్పారు. దాంతోపాటే పదేళ్ల ప్రభుత్వంలో చేసిన అక్రమాల చిట్టా తయారుగా ఉంది. ఇక లోపలికి వెళ్ళడమే మిగిలింది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి వ్యాఖ్యలు దేనికి సంకేతం అంటూ పలువురు నేతలు, ప్రజలు చర్చించుకుంటున్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు మేం భయపడబోమంటూ బీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ లు పంపారు. మంత్రి గారివి పేలని టపాసులని మా దగ్గరికి వస్తే పేలే టపాసులు పంపిస్తామంటూ సైటర్లు విసిరారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఆయన ఫ్లైట్ దిగగానే బాంబులతో స్వాగతం అంటూ బీఆర్ఎస్ నేతలు పోస్టర్లు రెడీ చేశారు. పిఎస్ఆర్ మూసీ బాంబ్, పొంగులేటి 15,0000 వాలా, పొంగులే బాంబ్, మూసీ ముఠాకి స్వాగతం అంటూ సోషల్ మీడియాలో పింక్ బ్యాచ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయింది. లక్షా యాభై వేల కోట్ల మూసీ ప్రాజెక్టును సూచిస్తూ గ్రాఫిక్స్ లో ఈ పోస్టర్లు రెడీ చేశారు. పొంగులేటి సౌత్ కొరియాలో ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కారు. ఈరోజు రాత్రి కల్లా హైదరాబాద్‌లో దిగిపోతారు. మరీ ఆయన చెప్పిన బాంబులేవీ ఇక్కడ పేలలేదు అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తుంది.దీంతో తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలు ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.