తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏ నాయకుడు ఎటు వెళ్తాడో, ఎవరు ప్రజల్లోకి వెళ్తారో చెప్పడం కష్టంగా మారింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు కేసీఆర్. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు అనేక కసరత్తులు చేస్తున్నారు. దానికి తగిన ఆలోచన చేస్తూ ప్రతి రాష్ట్రంలో బీఆర్ఎస్ కు సంబంధించిన రాష్ట్ర నాయకులను ఎంపిక చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్రంలో టిడిపి కూడా పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే ఖమ్మం నుంచి శంఖారావం పూరించింది. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకుంది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టిడిపి బలమైన పార్టీగా ఉండేది.
రాష్ట్రాలు వేరైన తర్వాత టీడీపీ నాయకులంతా ఇతర పార్టీల్లోకి వెళ్లి ఇక టిడిపి కోట అంతా ఖాళీ అయింది. ఈ తరణం లోనే చంద్రబాబు మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో టిడిపి పార్టీని ముందుకు తీసుకురావాలని కసరత్తులు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఖమ్మంలో నిర్వహించిన సభ సక్సెస్ అయింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఒక్కసారిగా కంగుతిన్నాయి. ఖమ్మంలో సభ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో టిడిపి పోలేదు అని అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి బడుగు బలహీన వర్గాల అండదండలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఈ సభ చూసిన చాలామంది నేతలు టిడిపి వైపు మళ్లీ మరలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టిడిపి నుంచి ఇతర పార్టీలో చేరిన నాయకులు ఆయా పార్టీల్లో నిలదొక్కుకోలేకపోతున్నారు. పూలమ్మినచోట కట్టలమ్మినట్టు అవమానానికి గురవుతున్నారు. ఈ తరుణంలో మోత్కుపల్లి నరసింహులు ,
నాగం జనార్దన్ రెడ్డి ఏ పార్టీలో కూడా స్థిరంగా ఉండలేకపోతున్నారు. ఈ విధంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీ మారుతూ ప్రజల్లో చులకన అవుతున్నారు. ఈ తరుణంలో వీరంతా మళ్లీ ఖమ్మం సభ ద్వారా కొత్త ఉత్సాహాన్ని పొందినట్లు తెలుస్తోంది. మళ్లీ స్వగృహప్రవేశానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం అందుతుంది.. ఈ తరుణంలోనే మరో కీలక విషయం బయటకు వస్తోంది. ఇందులో నిజమెంతుందో అబద్ధం ఎంత ఉందో తెలియదు కానీ , పలువురు నోట్లో ఈ విషయం మాత్రం నానుతోంది అని చెప్పవచ్చు. ఇంతకీ అదేంటంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డి మరియు ఆయన సన్నిహితులు టిడిపి తీర్థం పుచ్చుకుంటారా అనే విధంగా గాంధీభవన్ లో పలువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది.
అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీని ఎలాగైనా బలోపేతం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పార్టీలో ఉన్న సీనియర్లు అడుగడుగునా అడ్డుపడుతూ రేవంత్ రెడ్డి వర్గీయులను వలసవాదులు అంటూ చులకన చేస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో మూడు లొల్లీలు ఆరు కొట్లాటలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఖమ్మం సభ పెట్టడం చాలా ఆసక్తికరంగా మారింది. ఈ సభ సక్సెస్ వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మళ్లీ తెలంగాణలో టిడిపి పార్టీకి పూర్వ వైభవం వస్తుందా , పాత నాయకులంతా ఆ పార్టీ వైపు చూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో..?
పైకి ఎక్కుదామంటే కింద పడేస్తున్నారు.. ఖమ్మం టిడిపి సభకు రేవంత్ కు ఏమైనా సంబంధం ఉందా..!!