సాధారణంగా తెలుగు వంటలన్నీ ఘాటుఘాటుగానే ఉంటాయి. కూరలో కారం తక్కువ అయితే చాలు ఇదేం కూర చప్పబడిపోయింది అని చాలామంది అన్నం కూడా తినరు. అందులోనూ పచ్చిమిర్చితో చేసిన కూరలు అంటే మహా ఇష్టం. ఇక పచ్చిమిర్చితో బజ్జీలు వేస్తే ఆ రుచే వేరు. పచ్చిమిర్చిలను ఏ రూపంలో తీసుకున్నా కూడా దాని టేస్టే వేరు. ఈ ఘాటు పచ్చిమిర్చి రుచి పరంగానే కాదు బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుందనే విషయం మీలో ఎవరికైనా తెలుసా? అవును మీరు వింటున్నది నిజమే.పచ్చిమిర్చిని రోజు వారి ఆహారంలో తీసుకుంటే ఓవర్ వెయిట్ నుంచి బయటపడవచ్చు. అంతేకాదు పచ్చిమిర్చిలో పోషక పదార్దాలు పుష్కలంగా ఉంటాయి.విటమిన్ ఏ, కాపర్, ఫైబర్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు పచ్చిమిర్చిలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు పచ్చిమిర్చిలో కేలరీలు మొత్తమే ఉండవు. వీటిని ప్రతి రోజు తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. మీరు అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే వెంటనే మీ రోజు వారి ఆహారంలో పచ్చిమిర్చిని చేర్చుకోవడం వల్ల అధిక బరువు నుండి విముక్తి పొందచ్చవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పచ్చిమిర్చి తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరగడం మొదలవుతుంది. అలాగే జీర్ణక్రియ సక్రమంగా జరగడం వల్ల ఫ్యాట్ తొందరగా కరుగుతుంది. పచ్చిమిర్చిలో ఉండే కాప్సైసిన్ అనే పదార్థం అధిక బరువు తగ్గడంలో తోడ్పడుతుందని ఒక పరిశోధనలో తేలింది. అంతేకాదు ఇది రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. అలాగని మంచి చేస్తుందని పచ్చిమిర్చిని మోతాదుకు మించి తినకూడదు. అంతేకాదు కడుపులో పుండ్లు ఉన్నవాళ్లు వీటిని అసలే ముట్టుకోకూడదు. ఒకవేళ తినాలి అనుకుంటే ముందుగా వైద్యులను సంప్రదించి తీసుకోవాలి.